September 12, 2026
Praja Telangana
తెలంగాణ

*లక్ష్య సాధనకు సంకల్పం.. క్రమశిక్షణే కీలకం*

మంచిర్యాల,ఆగస్టు 25(నేటి ప్రజా తెలంగాణ): ఎంచుకున్న లక్ష్యాన్ని దృఢ సంకల్పం, క్రమశిక్షణ, నిరంతర కృషితో సాధించుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని, పూర్తి ఏకాగ్రతతో సన్నద్ధం కావాలని సూచించారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “నిపుణ” ఎస్‌ఐ, పీసీ ఉచిత శిక్షణ కేంద్రాన్ని అధికారులు ప్రారంభించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, డీసీపీ ఎ. భాస్కర్, బెల్లంపల్లి సబ్‌ కలెక్టర్ మనోజ్, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, ఆర్‌ఐ సంపత్ తదితరులతో కలిసి జిల్లా కలెక్టర్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహించే పోలీసు శాఖలో ఎస్‌ఐ, పీసీ పోస్టుల కోసం అందిస్తున్న ఉచిత శిక్షణను అభ్యర్థులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉత్తమ శిక్షకుల ఆధ్వర్యంలో నాణ్యమైన శిక్షణతో పాటు అవసరమైన స్టడీ మెటీరియల్‌ను అందిస్తున్నట్లు తెలిపారు.పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే ప్రతి సబ్జెక్టుపై పూర్తి అవగాహనతో పాటు లోతైన పట్టు సాధించాలని సూచించారు. నిర్ణీత సమయంలో సిలబస్‌ను పూర్తి చేసుకుని, ప్రతిరోజూ నేర్చుకున్న అంశాలను పునశ్చరణ చేసుకోవాలని అన్నారు. ప్రిలిమ్స్‌లో వేలాది మంది అభ్యర్థులు పోటీపడుతున్న నేపథ్యంలో వారందరినీ అధిగమించే స్థాయిలో సిద్ధం కావాలని, మెయిన్స్‌లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచేలా సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.ఉచిత శిక్షణ తరగతులకు క్రమం తప్పకుండా హాజరవుతూ తమ వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. సబ్జెక్టులోని ప్రతి అంశంపై పట్టు సాధించడంతో పాటు ముఖ్యమైన విషయాలను నోట్స్‌గా రాసుకోవాలని సూచించారు.

ప్రతి రోజును కౌంట్‌డౌన్‌గా భావించాలి

రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ.. పరీక్షలకు మిగిలి ఉన్న ప్రతి రోజును కౌంట్‌డౌన్‌గా భావించి సద్వినియోగం చేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. సెలవులు, ఇతర కారణాలను పక్కనపెట్టి క్రమశిక్షణతో శిక్షణకు హాజరవుతూ తమ నైపుణ్యం, సామర్థ్యాన్ని నిరంతరం పెంచుకోవాలని అన్నారు.విజయం సాధించాలంటే దైనందిన అలవాట్లలో అవసరమైన మార్పులు చేసుకోవాలని, శిక్షణ సమయంలో పూర్తి ఏకాగ్రతతో ఉండాలని సూచించారు. ప్రతిరోజూ కొత్త విషయాలను నేర్చుకుంటూ, నేర్చుకున్న అంశాలను పునరావృతం చేసుకోవాలని తెలిపారు. ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని, ప్రతి అంశంలో నైపుణ్యం సాధించేలా కృషి చేయాలని అన్నారు.కేవలం ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా కాకుండా, ఉద్యోగంలో చేరిన తర్వాత ఉన్నత స్థాయిలో రాణించే విధంగా తమను తాము తీర్చిదిద్దుకోవాలని అభ్యర్థులకు సీపీ సూచించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, శిక్షకులు,పోటీ పరీక్షల అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

తుడుం దెబ్బ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి

ఆకెనపల్లి ‘భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

*డ్రగ్స్‌కు దూరంగా ఉండి లక్ష్యసాధనపై దృష్టి పెట్టాలి.. బాలికల భద్రతకు షీ టీమ్స్ అండ: ఎస్‌ఐ ఉషారాణి*

Share this