మంచిర్యాల, ఆగస్టు 02: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన, పోషక విలువలతో కూడిన అల్పాహారం,మధ్యాహ్న భోజనం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు.మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాలేజీ రోడ్డులో పాత వ్యవసాయ మార్కెట్ యార్డులో హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ట్రస్ట్ (ఇస్కాన్) ఆధ్వర్యంలో నిర్మిస్తున్న సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పరిశీలించారు.ఈ సందర్భంగా వంటశాల నిర్మాణ పురోగతి,ఆహార తయారీ విధానం, పరిశుభ్రత ప్రమాణాలు,ఆహార నిల్వ,ప్యాకింగ్, పంపిణీ వ్యవస్థలపై అధికారులు,సంస్థ ప్రతినిధులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన,పోషక విలువలతో కూడిన ఆహారం అందేలా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలనీ సూచించారు.విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ అన్వేష్, మేయర్ ధర్ని మధుకర్, హరే కృష్ణ మూవ్‌మెంట్ ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

