లక్షెట్టిపేట__హాజీపూర్,జూలై 23:మంచిర్యాల జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. గురువారం హాజీపూర్, లక్షెట్టిపేట మండలాల్లో పలు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి పనుల పురోగతిని సమీక్షించారు.హాజీపూర్ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో అదనపు గదులు, భోజనశాల నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెనూ ప్రకారం పౌష్టికాహారం, స్వచ్ఛమైన తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ విద్యార్థుల ఆరోగ్యం, హాజరుపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.తహసీల్దార్ కార్యాలయంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పరిశీలించిన ఆయన, ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్‌ను వేగవంతం చేసి ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అర్హులందరి వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. అలాగే భూభారతి, సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు.మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గ్రామపంచాయతీల పనితీరు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై సమీక్షిస్తూ గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు, తాగునీటి సరఫరా, జలసిరి పనులను వేగవంతం చేయాలని సూచించారు.అనంతరం లక్షెట్టిపేట 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అత్యవసర విభాగం, ల్యాబ్, మందుల నిల్వలు, పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. వర్షాకాలంలో అంటువ్యాధుల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించాలని, అవసరమైన మందులు అందుబాటులో ఉంచి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. అలాగే అమృత్–2.0 పనులు, కేజీబీవీ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

