రామకృష్ణాపూర్,జూలై 17: మంచిర్యాల జిల్లా కేంద్రం రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి బొక్కలగుట్ట గ్రామంలో నేరాల నియంత్రణ, ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా 12 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా సూచనల మేరకు, మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ, గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల నేరాల నియంత్రణ మరింత సమర్థవంతంగా సాగుతుందని, నేరస్తులను వేగంగా గుర్తించి పట్టుకునేందుకు దోహదపడుతుందని తెలిపారు. ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో ప్రజల సహకారంతో మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులను పోలీసులు అభినందించారు. బొక్కలగుట్ట గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు విశేషంగా కృషి చేసిన రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లును మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ ఘనంగా సత్కరించి ప్రశంసించారు. గ్రామ భద్రతకు ఆయన అందించిన సేవలు అభినందనీయమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ వి.కిరణ్ కుమార్, మందమర్రి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పి.రమేష్, రామకృష్ణాపూర్ ఎస్‌ఐ జె.శ్రీధర్,పోలీసు సిబ్బంది,గ్రామ పెద్దలు,ప్రజాప్రతినిధులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

