మంచిర్యాల,జూలై 11:ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అరుణశ్రీ, డాక్టర్ సుధాకర్ నాయక్, జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూలై 11 నుంచి 18వ తేదీ వరకు జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో కుటుంబ సంక్షేమం,కుటుంబ నియంత్రణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కుటుంబ సంక్షేమ కార్యక్రమంలో భాగంగా “పిల్లలకు సరైన అంతరం – ఆరోగ్యకరమైన కుటుంబం” అనే నినాదంతో అర్హులైన దంపతులకు అవగాహన కల్పించాలని సూచించారు. తల్లి, బిడ్డల ఆరోగ్య పరిరక్షణ కోసం తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.స్త్రీలకు నోటి మాత్రలు, మాల-ఎన్, ఛాయా, ఈ-పిల్స్, ఐయూసీడీ, అంతరా ఇంజెక్షన్ వంటి తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులు, పురుషులకు వాసెక్టమీ, మహిళలకు ట్యూబెక్టమీ వంటి శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతులపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆరోగ్య సిబ్బందికి సూచించారు.అలాగే ఆశా కార్యకర్తలు గ్రామాల్లో చిన్న చిన్న సమావేశాలు నిర్వహించి, నోటీసు బోర్డుల ద్వారా కుటుంబ నియంత్రణ పద్ధతులపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, మాస్ మీడియా బృందం సభ్యులు అల్లాడి శ్రీనివాస్, ఎం.డి. రషీద్, సీహెచ్‌వోలు నాందేవ్, కాకిరాల వెంకటేశ్వర్లు, పుట్ట సత్తయ్య, ఆర్.ఎస్. పద్మ, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నర్సింగ్ సూపరింటెండెంట్, జిల్లా సబ్ యూనిట్ అధికారి శ్రీనివాస్, వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

