మంచిర్యాల,జూలై 6:పెంపుడు కుక్కలు, పిల్లులకు తప్పనిసరిగా రేబిస్ టీకాలు వేయించి వాటి ఆరోగ్యంతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కూడా కాపాడాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం మంచిర్యాల పట్టణంలోని ప్రాథమిక పశువైద్య కేంద్రంలో నిర్వహించిన ఉచిత రేబిస్ టీకాల కార్యక్రమంలో జిల్లా పశు వైద్య, పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ యాకూబ్ రెడ్డి, డివిజన్ కార్పొరేటర్ సుదమల్ల హరికృష్ణతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు సంక్రమించే జూనోటిక్ వ్యాధుల నివారణకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులు, పశుపోషకులు జంతువులకు సకాలంలో టీకాలు వేయించడంతో పాటు పరిశుభ్రత పాటించాలని, అనారోగ్యంతో ఉన్న జంతువులను వేరుగా ఉంచాలని, పాలు, మాంసాన్ని పరిశుభ్రంగా నిర్వహించాలని తెలిపారు. చనిపోయిన జంతువులను శాస్త్రీయ పద్ధతిలో పారవేసి, అనుమానాస్పద లక్షణాలు కనిపిస్తే వెంటనే పశువైద్యులను సంప్రదించాలని సూచించారు.
రేబిస్ వ్యాధిని పూర్తిగా నివారించవచ్చని, క్రమం తప్పకుండా టీకాలు వేయించడం ద్వారా కుటుంబాలు, సమాజాన్ని సురక్షితంగా ఉంచవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో 32 పెంపుడు కుక్కలకు ఉచితంగా రేబిస్ టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్ శాంతిరేఖ, లైవ్‌స్టాక్ అసిస్టెంట్ సోనియా, గోపాలమిత్ర వేణు, సహాయకులు గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

