మంచిర్యాల,జూన్ 22:మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విశ్వశాంతి కేరళ స్కూల్‌లో మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న అవగాహన వారోత్సవాల్లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమానికి మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా విద్యార్థులు మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై రూపొందించిన చిత్రాలను డీసీపీ పరిశీలించి అభినందించారు.అనంతరం డీసీపీ మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం వల్ల ఆరోగ్యం,కుటుంబం, సమాజంపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు.యువత చిన్న వయస్సులోనే మత్తు పదార్థాలకు ఆకర్షితులై వ్యసనాలకు బానిసలవుతున్నారని,దీనివల్ల భవిష్యత్తు దెబ్బతింటుందని పేర్కొన్నారు.డ్రగ్స్ విక్రయించే వారిపై పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కొంతమంది యువత తెలిసో తెలియకో మాదకద్రవ్యాల బారిన పడుతున్నారని, చిన్న ఆసక్తితో సిగరెట్ లేదా ఇతర మత్తు పదార్థాలను ప్రయత్నించడం క్రమంగా వ్యసనంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.మాదకద్రవ్యాల వినియోగం వల్ల మానసిక సమతుల్యత దెబ్బతినడంతో పాటు కుటుంబ సభ్యులకు, సమాజానికి ఇబ్బందులు కలుగుతాయని వివరించారు.విద్యార్థులు హానికరమైన విషయాలకు ధైర్యంగా “నో” చెప్పడం నేర్చుకోవాలని డీసీపీ సూచించారు. చిన్నప్పటి నుంచే సరైన నిర్ణయాలు తీసుకునే అలవాటు పెంపొందించుకుంటే భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదుగుతారని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా మాదకద్రవ్యాలకు సంబంధించిన కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని, అవసరమైతే డయల్-100 ద్వారా పోలీసులకు తెలియజేయాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాశ్, శ్రీరాంపూర్ ఇన్‌స్పెక్టర్ అశోక్ కుమార్, ఎస్‌ఐ సంతోష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

