September 11, 2026
Praja Telangana
తెలంగాణ

*కౌమార బాలబాలికల ఆరోగ్యంపై విస్తృత అవగాహన కల్పించాలి: డీఎంహెచ్‌వో డాక్టర్ నరేందర్ రాథోడ్*

మంచిర్యాల, సెప్టెంబర్ 8: రాష్ట్రీయ కిషోర్ స్వాస్థ్య కార్యక్రమం (ఆర్‌కేఎస్‌కే)లో భాగంగా 10 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల కౌమార బాలబాలికలు, పీర్ గ్రూప్ సభ్యులకు ఆరోగ్య అవగాహన కల్పించేందుకు మంగళవారం మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో కరపత్రాలు, పోస్టర్లను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలల్లో కౌమార బాలబాలికలకు విస్తృతంగా ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పీర్ గ్రూప్ సభ్యుల ద్వారా సరైన ఆరోగ్య సమాచారం, సలహాలు, సహాయం, గోప్యతతో కూడిన సేవలను అందించడం ద్వారా కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయవచ్చన్నారు.రుతుస్రావం, లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్యం, రక్తహీనత, మధుమేహం, రక్తపోటు, మానసిక ఆరోగ్యం, పోషకాహారం, గాయాలు, హింస నివారణ వంటి అంశాలపై బాలబాలికలకు అవగాహన కల్పించాలని సూచించారు. మద్యం, ధూమపానం, డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాలు, వ్యసనాలకు దూరంగా ఉండేలా ప్రత్యేకంగా అవగాహన కల్పించాలని తెలిపారు.మంచి స్పర్శ–చెడు స్పర్శపై బాలబాలికలకు అవగాహన కల్పిస్తూ, ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే వెంటనే ఎదిరించి, అక్కడి నుంచి దూరంగా వెళ్లి నమ్మకమైన వ్యక్తులకు తెలియజేయాలని, అవసరమైతే చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కు సమాచారం అందించాలని సూచించారు.బాల్యవివాహాల వల్ల రక్తహీనత, అకాల గర్భధారణ, ప్రసూతి, శిశు మరణాలు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. బాల్య వివాహ నిషేధ చట్టం–2006 ప్రకారం 18 సంవత్సరాల లోపు బాలికలకు, 21 సంవత్సరాల లోపు బాలురకు వివాహం చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు.జిల్లాలోని పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాల్లో పీర్ గ్రూప్ సభ్యుల సహకారంతో అవగాహన కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహించాలని డాక్టర్ నరేందర్ రాథోడ్ కోరారు.ఈ కార్యక్రమంలో ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అనిల్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, సీహెచ్‌వోలు కాకిరాల వెంకటేశ్వర్లు, పుట్టా సత్తయ్య, శ్రీనివాస్, ఆర్‌.ఎస్‌. పద్మ, సుమన్, లక్ష్మణస్వామి తదితరులు పాల్గొన్నారు.

Related posts

*జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ నరేందర్ రాథోడ్ బాధ్యతల స్వీకరణ*

*ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు*

సమానత్వంకై మహాత్మా జ్యోతిబాపూలే చేసిన కృషి చిరస్మరణీయం

Share this