రామగుండం,ఆగస్టు 24 (నేటి ప్రజా తెలంగాణ) పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల ప్రజల సమస్యలను త్వరితగతిన, పారదర్శకంగా పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న గ్రీవెన్స్ డే కార్యక్రమానికి ఫిర్యాదుదారుల నుంచి స్పందన లభిస్తోంది. ప్రతి సోమవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా స్వయంగా ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా వివిధ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితులతో సీపీ నేరుగా మాట్లాడి, వారి సమస్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, సంబంధిత పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌వోలతో ఫోన్లో మాట్లాడి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ఫిర్యాదులపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి, బాధితులకు న్యాయం జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు సీపీ స్పష్టం చేశారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా పోలీసుల దృష్టికి తీసుకురావచ్చని, ప్రతి ఫిర్యాదును అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి పరిష్కరించేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తోందని తెలిపారు.ప్రజలకు పోలీస్ శాఖపై నమ్మకం, భరోసా కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్న సీపీ, ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం, అలసత్వానికి తావులేకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు. బాధితులకు సత్వర న్యాయం అందేలా నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (పరిపాలన) కె. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
previous post

