మంచిర్యాల,ఆగస్టు 4:నగర ప్రజలకు తాగునీటి సరఫరాను సాధ్యమైనంత త్వరగా పూర్తిస్థాయిలో పునరుద్ధరించేలా మంచినీటి ప్రధాన పైపులైన్ పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు, వరద ఉధృతి కారణంగా మంచిర్యాల నగరానికి మంచినీటిని సరఫరా చేసే ప్రధాన పైపులైన్ దెబ్బతినడంతో పునరుద్ధరణ పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. వరద ఉధృతి తగ్గడంతో పనులను వేగవంతం చేసినప్పటికీ సోమవారం రాత్రి కురిసిన వర్షాలతో మరోసారి వరద ప్రవాహం పెరిగి పనులకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు మేయర్ దర్ని మధుకర్ పనులు జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించి పునరుద్ధరణ పనుల పురోగతిని పరిశీలించారు. ఆధునిక చైన్ జేసీబీల సహాయంతో వరద నీటి ప్రవాహాన్ని మళ్లించి పైపులైన్ నిర్మాణ పనులు కొనసాగిస్తున్న తీరును పరిశీలించారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనులను మరింత వేగవంతం చేయాలని, నాణ్యతలో రాజీ లేకుండా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచినీటి సరఫరాను త్వరలోనే పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తామని మేయర్ తెలిపారు. పనులు పూర్తయ్యే వరకు అవసరమైన చర్యలను చేపడుతూ అధికారులతో అక్కడే సమీక్ష నిర్వహించారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కాకుల వరలక్ష్మి యువరాజ్, నంబయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేష్, డీఈ రాజేందర్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

