కోటపల్లి, జూలై 25: మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గం కోటపల్లి మండలం ఎసన్వాయి గ్రామంలో పోలీసులు, ఎక్సైజ్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం విస్తృత స్థాయిలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.గుడుంబా తయారీ,చట్టవ్యతిరేక కార్యకలాపాల నిర్మూలనతో పాటు గ్రామంలో శాంతిభద్రతలను పటిష్ఠం చేసే లక్ష్యంతో చేపట్టిన ఈ తనిఖీల్లో గ్రామంలోని ప్రతి ఇంటిని అధికారులు పరిశీలించారు.సుమారు 50 మంది పోలీసు అధికారులు, సిబ్బంది, 30 మంది ఎక్సైజ్ శాఖ సిబ్బంది కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా గ్రామస్థుల వివరాలు సేకరించడంతో పాటు కొత్తగా వచ్చిన వ్యక్తులు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు, ఐదు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.గుడుంబా తయారీ స్థావరాలపై నిర్వహించిన దాడుల్లో సుమారు వెయ్యి లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేయగా,30 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘటనకు సంబంధించి తొమ్మిది మందిపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా జైపూర్ ఏసిపి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్రామాల్లో నేరాల నియంత్రణ, ప్రజల్లో భద్రతాభావం పెంపొందించడమే లక్ష్యంగా కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలను తప్పనిసరిగా కలిగి ఉండాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో చెన్నూర్ గ్రామీణ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆర్.కృష్ణ,ఎక్సైజ్ సహాయ సూపరింటెండెంట్ శ్రీరామ్ రెడ్డి, కోటపల్లి, నీల్వాయి పోలీసు అధికారులు,ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సమ్మయ్య,అక్బర్ హుస్సేన్, పోలీసు,ఎక్సైజ్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

