మంచిర్యాల,మే30:రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆధ్వర్యంలో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు,దర్యాప్తు పురోగతి,వారెంట్ల అమలుపై సమీక్ష నిర్వహించిన సీపీ,కేసుల దర్యాప్తులో పారదర్శకత, నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.2025కు ముందు నమోదై పెండింగ్‌లో ఉన్న గ్రేవ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, మహిళలపై నేరాలు,కిడ్నాపింగ్,మిస్సింగ్,ఆర్థిక నేరాల కేసుల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండొద్దని సూచించారు.నాన్-బెయిలబుల్ వారెంట్ల అమలుపై ప్రత్యేక దృష్టి సారించి కన్విక్షన్ శాతం పెంచేందుకు కృషి చేయాలన్నారు.అక్రమ ఇసుక రవాణా, గుడుంబా తయారీ,పేకాట,గుట్కా విక్రయాలు,రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన సీపీ,ప్రజల ఫిర్యాదులపై వెంటనే స్పందించి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించే అధికారులను సహించేది లేదని హెచ్చరించిన సీపీ,పోలీస్ సిబ్బంది హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగంలో ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు.సమావేశంలో డీసీపీలు,ఏసీపీలు,సీఐలు,ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.

