October 4, 2026
Praja Telangana
తెలంగాణ

*టిబీపై అవగాహనతో ముందస్తు పరీక్షలు చేయించుకోవాలి: డీఎంహెచ్‌ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్*

భీమారం,సెప్టెంబర్ 22 (నేటి ప్రజా తెలంగాణ):టిబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా భీమారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సామాజిక కార్యకర్త చెరుకు సర్వోత్తమ్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్, స్థానిక సర్పంచ్ విజయలక్ష్మి కలిసి 30 మంది క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార కిట్లు అందజేశారు.ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ.. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, రాత్రిపూట చెమటలు పట్టడం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రంలో క్షయ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వ్యాధిని సకాలంలో గుర్తించి వైద్యుల సూచన మేరకు ఆరు నెలల పాటు క్రమం తప్పకుండా మందులు తీసుకుంటే క్షయ వ్యాధిని పూర్తిగా నయం చేసుకోవచ్చన్నారు.మారుమూల ప్రాంతాల్లోనూ మొబైల్ ఎక్స్‌రే సేవల ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. క్షయ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం నిశ్చయ్ పోషణ్ యోజన కింద ప్రతి నెలా రూ.1,000 పోషణ భత్యం అందిస్తుందని పేర్కొన్నారు. టిబీ పరీక్షలు, చికిత్స, మందులు ఉచితంగా అందుబాటులో ఉన్నందున ప్రజలు వ్యాధిపై అవగాహన పెంచుకుని లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకోవాలని కోరారు. క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ ముస్తాఫా, డాక్టర్ అశోక్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రవి, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్కా వెంకటేశ్వర్, అల్లాడి శ్రీనివాస్, నామ్దేవ్, క్షయ వ్యాధి నియంత్రణ సిబ్బంది సాయి రెడ్డి, అనిల్, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

పవన్ కళ్యాణ్ ఆశయాలతో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

Chief Editor: Satish Kumar

Share this