గోదావరిఖని,సెప్టెంబర్ 21(నేటి ప్రజా తెలంగాణ):వినాయక నిమజ్జనాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు. గోదావరిఖనిలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో నిమజ్జన ఏర్పాట్లు, భద్రతా చర్యలపై సమీక్షించారు.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ గతేడాది నిమజ్జనంలో ఎదురైన సమస్యలను సమీక్షించి ఈసారి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. నిమజ్జన ప్రదేశాలు, శోభాయాత్ర మార్గాలు, రద్దీ ప్రాంతాలు, పార్కింగ్ ప్రదేశాలను ముందుగానే పరిశీలించాలని సూచించారు. నీటి లోతు, ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు శిక్షణ పొందిన ఈతగాళ్లు, రెస్క్యూ బృందాలు, రక్షణ పరికరాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.మున్సిపల్ అధికారులు పారిశుద్ధ్యం, తాగునీరు, లైటింగ్, పార్కింగ్ ఏర్పాట్లు చూడాలని, విద్యుత్ శాఖ ప్రమాదకర వైర్లు, స్తంభాలను పరిశీలించాలని సూచించారు. అగ్నిమాపక శాఖ ఫైర్ టెండర్లు, సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని తెలిపారు. పోలీస్ అధికారులు ట్రాఫిక్, బందోబస్తు, రద్దీ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.ఈ సమావేశంలో అదనపు డీసీపీ కె. శ్రీనివాస్, ఆర్జీ-1 జీఎం లలిత్ కుమార్, ఏసీపీలు నాగేంద్ర గౌడ్, ఎం. రమేష్, వెంకటేశ్వర్లు, ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, సీఐలు కృష్ణకుమార్, ప్రసాద్ రావు, నవీన్ కుమార్, ఎస్ఐ భూమేష్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
previous post

