September 12, 2026
Praja Telangana
తెలంగాణ

*నేత్రదానంతో మరో జీవితానికి వెలుగు.. విద్యార్థులకు కంటి ఆరోగ్యంపై అవగాహన*

మంచిర్యాల,సెప్టెంబర్ 2 (నేటి ప్రజా తెలంగాణ): నేత్రదానం పక్షోత్సవాల్లో భాగంగా మంచిర్యాల పట్టణంలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో బుధవారం నేత్రదానం, కంటి ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలల కోఆర్డినేటర్ అశోక్‌తో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ నేత్రదానం ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, నేత్రదానం ద్వారా మరొకరి జీవితంలో వెలుగులు నింపవచ్చని తెలిపారు. కంటి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మూడు నెలల క్రితం ఆర్‌బీఎస్‌కే, జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించగా, అవసరమైన విద్యార్థుల కోసం జిల్లాకు 850 కంటి అద్దాలు అందినట్లు తెలిపారు. ఇందులో భాగంగా పాఠశాలలో 35 మంది విద్యార్థులకు ప్రభుత్వ పరంగా అందించిన కంటి అద్దాలను పంపిణీ చేశారు. కంటి సంబంధిత సమస్యలు రాకుండా పౌష్టికాహారం తీసుకోవాలని, ఆకుకూరలు, పండ్లు, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. సెల్‌ఫోన్లను గంటల తరబడి చూడటం వల్ల కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున మొబైల్ వినియోగాన్ని పరిమితం చేసుకోవాలని, కంటి అద్దాలను సరైన విధంగా ఉపయోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని, శుభ్రమైన మంచినీటిని తాగాలని, నిల్వ ఉన్న ఆహార పదార్థాలను తీసుకోకుండా తాజాగా తయారు చేసిన ఆహారాన్ని తీసుకోవాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పాఠశాల వంటగదిని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు వంట పాత్రలు, తాగునీటి పాత్రలను శుభ్రంగా ఉంచాలని, కూరగాయలను పరిశీలించి వినియోగించాలని, వంట చేసే సిబ్బందికి తగిన అవగాహన కల్పించాలని సూచించారు. ప్రత్యేక వంటకాలు తయారు చేసే సమయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్‌బీఎస్‌కే వైద్యులు, వైద్య సిబ్బంది, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, సీహెచ్‌ఓలు నాందేవ్, కాకిరాల వెంకటేశ్వర్లు, హెల్త్ ఎడ్యుకేటర్ అల్లాడి శ్రీనివాస్, జిల్లా అంధత్వ నివారణ కోఆర్డినేటర్ శంకర్, సిబ్బంది, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

*సహారా డిపాజిటర్లకు న్యాయం చేయాలి: జంతర్‌మంతర్ నిరసనలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ మద్దతు*

*వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: డీఎంహెచ్‌ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్*

అంతర్జాతీయ అందాల పోటీలను సందర్శించే అవకాశం లభించడంపై ఆనందం వ్యక్తపరచిన స్థానిక విద్యార్థి.

Share this