చెన్నూర్,ఆగస్టు 28(నేటి ప్రజా తెలంగాణ):ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా నిరంతరాయంగా సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం చెన్నూర్ పట్టణంలో అమృత్ 2.0 పథకం కింద కొనసాగుతున్న నీటి ట్యాంక్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ప్రజలకు ప్రతిరోజూ నిరంతరాయంగా తాగునీటిని అందించేందుకు చేపట్టిన అమృత్ 2.0 పథకంలోని నీటి ట్యాంక్ నిర్మాణం, పైప్‌లైన్ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు.మండల కేంద్రంలో కొనసాగుతున్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రహరీ గోడ, ఆసుపత్రిలోని నిర్మాణ పనులను పరిశీలించి పనులను వేగవంతం చేయాలని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలుర ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. తరగతి గదులు, వంటశాలను పరిశీలించిన కలెక్టర్.. వంట సిబ్బంది ఆహారం తయారీ సమయంలో శుభ్రత నిబంధనలు పాటించాలని, విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టికాహారం, శుద్ధమైన తాగునీటిని అందించాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని తెలిపారు.ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని, తరగతిలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఎలాంటి సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైన ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.అనంతరం మండల తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్.. తహసీల్దార్ మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్‌లతో కలిసి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ, భూముల రీ-సర్వే నిర్వహణ తీరును పరిశీలించారు. ఎస్‌ఐఆర్ నోటీసుల జారీ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని, బూత్ స్థాయి అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించేలా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు.భూముల రీ-సర్వేలో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ, అటవీ భూములు, గ్రామాల హద్దుల నిర్ధారణను సమర్థవంతంగా చేపట్టాలని, రెవెన్యూ రికార్డులను సక్రమంగా సిద్ధం చేసి అవసరమైన సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని తెలిపారు. భూభారతి దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేసి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు.అనంతరం కోటపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి తహసీల్దార్ రాఘవేంద్ర, మండల పరిషత్ అభివృద్ధి అధికారి నాగేశ్వర్ రెడ్డిలతో కలిసి ఎస్‌ఐఆర్, భూముల రీ-సర్వే ప్రక్రియ నిర్వహణపై సమీక్షించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో నోటీసుల జారీ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని, భూముల రీ-సర్వే నిర్వహణలో అధికారులు నిబంధనలకు లోబడి విధులు నిర్వహించాలని, సర్వే ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
previous post

