September 12, 2026
Praja Telangana
తెలంగాణ

*ఆగస్టు 31న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభం.. 49,104 మంది విద్యార్థులకు ప్రతిరోజూ పోషకాహార అల్పాహారం*

మంచిర్యాల,ఆగస్టు 27(నేటి ప్రజా తెలంగాణ):తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రాంలో భాగంగా మంచిర్యాల మెడికల్ గోడౌన్ ప్రాంగణంలో నిర్మించిన అధునాతన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను ఈ నెల 31న సోమవారం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కిచెన్ నిర్వహణకు హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ (HKMCF) అమలు భాగస్వామిగా వ్యవహరిస్తుండగా, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) తన సీఎస్‌ఆర్ నిధుల ద్వారా కిచెన్ నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించింది. ఈ సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని 17 మండలాల పరిధిలో 691 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 42,450 మంది విద్యార్థులకు, 13 జూనియర్ కళాశాలల్లో చదువుతున్న 6,654 మంది విద్యార్థులకు ప్రతిరోజూ నాణ్యమైన, పరిశుభ్రమైన, పోషక విలువలతో కూడిన అల్పాహారం అందించనున్నారు. మొత్తంగా 49,104 మంది విద్యార్థులు ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనం పొందనున్నారు.

ఆధునిక సాంకేతికతతో భారీ స్థాయిలో క్వాలిటీ తో కూడిన ఆహార తయారీ

ప్రభుత్వం కేటాయించిన 8,000 చదరపు అడుగుల షెడ్‌లో ఈ సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంతో పాటు ఆహార నాణ్యత, పరిశుభ్రత, భద్రతా ప్రమాణాలను అత్యున్నత స్థాయిలో నిర్వహించేందుకు ఫుడ్ ల్యాబ్, మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ వంటి ప్రత్యేక సదుపాయాలను ఏర్పాటు చేశారు. కిచెన్‌లో అధునాతన ఆటోమేటెడ్ యంత్రాలను ఏర్పాటు చేశారు. ఆటోమేటెడ్ స్టీమర్ల ద్వారా గంటకు 5,600 ఇడ్లీలు, ఆటోమేటిక్ దోశ మెషీన్ ద్వారా గంటకు 2,000 దోశలు, ఆటోమేటిక్ పూరీ మెషీన్ ద్వారా గంటకు 3,600 పూరీలు తయారు చేయగల సామర్థ్యం ఉంది. సాంబార్, కూరల తయారీ యూనిట్ల ద్వారా రెండు గంటల్లో 5,000 మంది విద్యార్థులకు సరిపడా ఆహారం తయారు చేయవచ్చు. రైస్ కుకింగ్ పరికరాల ద్వారా కేవలం 40 నిమిషాల్లో 1,000 మందికి సరిపడా అన్నం తయారు చేసే సామర్థ్యం ఉంది. అలాగే ఆటోమేటిక్ వెజిటబుల్ వాషింగ్ అండ్ కటింగ్ యూనిట్, ఆర్వో వాటర్ ప్లాంట్, బాయిలర్ ప్లాంట్, సెంట్రల్ గ్యాస్ బ్యాంక్ వంటి ఆధునిక సదుపాయాలను ఏర్పాటు చేశారు. దీంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులకు ఒకేసారి పరిశుభ్రమైన, నాణ్యమైన అల్పాహారాన్ని సిద్ధం చేసి సరఫరా చేసే అవకాశం ఏర్పడింది.

న్యూట్రిషన్ సూచనలతో మెనూ…. మూడు జిల్లాల్లో 17 మండలాలకు ప్రయోజనం

విద్యార్థులకు సమతుల్యమైన, పోషక విలువలతో కూడిన అల్పాహారం అందించేందుకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సూచనల మేరకు మెనూను రూపొందించారు. సోమవారం ఇడ్లీ–సాంబార్, మంగళవారం పూరీ–ఆలూ కుర్మా, బుధవారం దోశ–చట్నీ, గురువారం ఉప్మా–చట్నీ, శుక్రవారం మిల్లెట్ ఇడ్లీ–సాంబార్, శనివారం బోండా–చట్నీ అందించనున్నారు. ఈ కిచెన్ పరిధిలో జగిత్యాల జిల్లాలోని వెల్లటూరు, ఎండపల్లి, మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, జన్నారం, మందమర్రి, లక్సెట్టిపేట, దండేపల్లి, కాజీపేట, నెన్నాల్, హాజీపూర్, నాస్పూర్, భీమారం, పెద్దపల్లి జిల్లాలోని రామగుండం, పెద్దపల్లి, అంతర్గాం మండలాలు ఉన్నాయి. విద్యార్థులు ఉదయం పూట ఆకలితో పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు వెళ్లకుండా ఆరోగ్యకరమైన, పోషకాహారంతో కూడిన అల్పాహారం తీసుకుని ఉత్సాహంగా విద్యను అభ్యసించేలా చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ప్రతిరోజూ పరిశుభ్రమైన వాతావరణంలో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ అల్పాహారం అందించడం ద్వారా విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారం, విద్యాభ్యాసంపై సానుకూల ప్రభావం చూపుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హిస్ గ్రేస్ శ్రీ సత్య గౌర చంద్ర దాస స్వామీజీ, హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ (HKMCF) అధ్యక్షులు, ది అక్షయ పాత్ర ఫౌండేషన్ – తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రీజినల్ ప్రెసిడెంట్‌తో పాటు HKMCF ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొననున్నారు.

Related posts

డాక్టర్ ఏ సందర్భంగా గవర్నమెంట్ డాక్టర్లకు సన్మానించిన బీఎస్పీ నాయకులు

*జల్ సంచయ్ జన భాగీదారి–3.0లో ప్రజలందరూ భాగస్వాములు కావాలి: క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ మురళి కృష్ణ*

Share this