బొక్కలగుట్ట,ఆగస్టు 9:క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రముఖ మైసమ్మ అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాస బోనాల వేడుకలు ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.పరిసర ప్రాంతాలతో పాటు వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఉత్సవాల సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి.మహిళలు సంప్రదాయబద్ధంగా బోనాలను నెత్తిన ఎత్తుకుని ఆలయానికి చేరుకుని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు.డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, భక్తుల సందడితో పరిసర ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది.ఈ సందర్భంగా క్యాతన్ పల్లి మున్సిపల్ చైర్మన్ గొడిశెల సంధ్యారాణి–రాజా రమేష్ దంపతులు,కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు వొడ్యాల శ్రీనివాస్ తదితరులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసుల ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.ఏసీపీ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భద్రతా చర్యలను పర్యవేక్షిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు.ట్రాఫిక్ నియంత్రణతో పాటు ఆలయ పరిసరాల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు.ఉత్సవాలు ప్రశాంతంగా జరగడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఆలయ నిర్వాహకులు, పోలీసులు సమన్వయంతో ఏర్పాట్లు చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారి దర్శనం చేసుకున్నామని పలువురు భక్తులు తెలిపారు.ఈ కార్యక్రమంలో భక్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆలయ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

