రామకృష్ణాపూర్, జూలై 24: స్థానిక పోలీస్ స్టేషన్‌లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్సై)గా విధులు నిర్వహించిన ఆదిమూలం సత్తయ్య సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై)గా పదోన్నతి పొంది కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు బదిలీ కావడంతో శుక్రవారం పోలీస్ అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు.ఈ సందర్భంగా బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, మందమర్రి సీఐ పర్శ రమేష్, మందమర్రి ఎస్సై నరేష్, రామకృష్ణాపూర్ ఎస్సై జాడి శ్రీధర్‌తో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది పుష్పగుచ్ఛం అందజేసి,శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం అధికారులు మాట్లాడుతూ, ఆదిమూలం సత్తయ్య విధి నిర్వహణలో నిబద్ధత, నిజాయితీతో సేవలందించి శాఖకు మంచి పేరు తీసుకొచ్చారని కొనియాడారు. పదోన్నతితో కొత్త బాధ్యతలు చేపట్టిన ఆయన ఇదే అంకితభావంతో విధులు నిర్వహిస్తూ మరిన్ని ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.అనంతరం ఆదిమూలం సత్తయ్య సహచర అధికారులు,సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, తాను ఎక్కడ పనిచేసినా అదే నిబద్ధత, సేవాభావంతో విధులు నిర్వహిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీస్ ఉన్నత అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

