బెల్లంపల్లి,జూలై 23: బెల్లంపల్లి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన గొర్రెల దొంగతనం కేసును పోలీసులు ఛేదించి నలుగురు నిందితులను అరెస్టు చేశారు. దొంగిలించిన ఒక గొర్రెతో పాటు దొంగతనానికి వినియోగించిన మూడు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.బుడిదగడ్డ బస్తీకి చెందిన మహ్మద్ అబ్దుల్లాకు నాలుగు గొర్రెలు, పది మేకలు ఉన్నాయి. ప్రతిరోజూ వాటిని మేతకు తీసుకెళ్లి తిరిగి ఇంటికి తీసుకొచ్చే సమయంలో ఈ నెల 20న సింగరేణి ఫంక్షన్ హాల్ సమీపంలో ఒక ఆడ గొర్రె కనిపించకుండా పోయింది. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించి ఉంటారని భావించి ఈ నెల 21న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగిలించిన గొర్రె విలువ సుమారు రూ.10 వేలుగా పేర్కొన్నారు.ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి దొంగిలించిన గొర్రెతో పాటు దొంగతనానికి వినియోగించిన మూడు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.ప్రజల ఆస్తులను దొంగిలించే వారిపై కఠిన చర్యలు తప్పవని, చట్టం ముందు ఎవరూ తప్పించుకోలేరని పోలీసు అధికారులు హెచ్చరించారు.

