బెల్లంపల్లి, జూలై 23 (నేటి ప్రజా తెలంగాణ):బెల్లంపల్లిలోని మహాత్మ జ్యోతిబా ఫూలే బీసీ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ విద్యాసంస్థలో విద్యార్థినులు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో అస్వస్థతకు గురైన ఘటన నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ విద్యాసంస్థను, బెల్లంపల్లి జనరల్ ఆస్పత్రిని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ, గురువారం రాత్రి 12 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరగా వారికి అవసరమైన చికిత్స అందించి శుక్రవారం ఉదయం డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. అనంతరం మరో 8 మంది విద్యార్థినులు వాంతులు, విరేచనాల లక్షణాలతో ఆస్పత్రికి రావడంతో వెంటనే వైద్య సేవలు అందించామని చెప్పారు. వారిలో ఏడుగురిని చిన్నపిల్లల వైద్య నిపుణుల పరిశీలన కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం విద్యార్థులందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.అనంతరం రెసిడెన్షియల్ విద్యాసంస్థలోని వంటగది, భోజనశాలను పరిశీలించి విద్యార్థులకు అందిస్తున్న బియ్యం, పప్పులు, కూరగాయలు, గుడ్లు, తాగునీటి నాణ్యతను తనిఖీ చేశారు. వంటకు ఉపయోగించే నీరు, వంట పాత్రల పరిశుభ్రత, ఆహార తయారీ విధానంపై సిబ్బందికి సూచనలు చేశారు. ఆహార పదార్థాలు వేడిగా వడ్డించాలని, పరిశుభ్రత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి వాసు రామ్, జిల్లా సర్వైలెన్స్ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్, ఎపిడెమియాలజిస్ట్ సుమన్ ఆధ్వర్యంలో ఆహార పదార్థాలు, తాగునీటి నమూనాలను సేకరించి పరీక్షల కోసం పంపించారు.ఆర్బీఎస్కే వైద్య బృందం ఆధ్వర్యంలో విద్యాసంస్థలో రెండు రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించాలని ఆదేశించారు.మిగిలిన విద్యార్థులందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు చేతులను శుభ్రంగా కడుక్కోవడం, సురక్షితమైన తాగునీటినే వినియోగించడం, వేడిగా ఉన్న ఆహారం తీసుకోవడం, దోమల నివారణ చర్యలు పాటించాలంటూ అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సుధాకర్ నాయక్, బెల్లంపల్లి జనరల్ ఆస్పత్రి సంచాలకుడు డాక్టర్ రవి,డాక్టర్ అరుణ్, జిల్లా ఆర్‌సీఓ శ్రీధర్, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి వాసు రామ్, ఎపిడెమియాలజిస్ట్ సుమన్, ఆర్బీఎస్కే వైద్యాధికారి డాక్టర్ సుచరిత, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

