July 28, 2026
Praja Telangana
తెలంగాణ

*వ్యాక్సినేషన్‌లో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్*

మంచిర్యాల, జూలై 22: జిల్లాలో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాల్లో ప్రతి కేంద్రంలో నిర్దేశించిన నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ ఆదేశించారు.బుధవారం అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రాజీవ్‌నగర్ పరిధిలోని సున్నంబట్టివాడ అంగన్‌వాడీ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని, పాత మంచిర్యాల అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మేదరివాడ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి వ్యాక్సినేషన్ నిర్వహణను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కేంద్రంలో అర్హుల జాబితా ఆధారంగా సమయపాలనతో టీకాల కార్యక్రమం నిర్వహించాలని, అన్ని రకాల టీకాలు అందుబాటులో ఉంచాలని, టీకాలు, వాటికి సంబంధించిన ద్రావణాల గడువు తేదీలు తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. టీకాలను నిర్దేశిత ఉష్ణోగ్రతలో భద్రపరచడంతో పాటు అత్యవసర చికిత్స సామగ్రి సిద్ధంగా ఉంచాలని, తెరిచిన టీకా సీసాల వినియోగ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.టీకాలు వేసిన వెంటనే వివరాలను అదే రోజు తల్లి–శిశు నమోదు పుస్తకంలో, టీకాల నమోదు వ్యవస్థలో నమోదు చేయాలని, తదుపరి టీకా తేదీని తల్లిదండ్రులకు తెలియజేయాలని సూచించారు. టీకా అనంతరం చిన్నారులను కొంతసేపు పరిశీలనలో ఉంచడంతో పాటు తల్లులకు తల్లిపాల ప్రాధాన్యం, శిశు పోషకాహారం, పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని చెప్పారు.వర్షాకాలంలో కీటకాల ద్వారా, కలుషిత నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు ఆశ, అంగన్‌వాడీ, మున్సిపల్ ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో ఇంటింటి పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. 14 సంవత్సరాలు పూర్తి చేసిన బాలికలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ టీకాపై అవగాహన కల్పించి అర్హుల వివరాలను నమోదు చేయాలని, క్షయవ్యాధి అనుమానితులను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, ఆరోగ్య సిబ్బంది వెంకటసాయి, శైలజ, వనిత, లక్ష్మి, శ్రీకళ, ఆశ కార్యకర్తలు, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

*నీట్ రీ-పరీక్షకు పటిష్ట భద్రత.. పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలు:పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా*

ప్రజల హృదయాల్లో నిలిచిన నాయకుడు – డాక్టర్ రాజా రమేష్ కు జన్మదిన శుభాకాంక్షలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నాకో అవకాశం ఇవ్వండి: రాజాసింగ్

Share this