మంచిర్యాల,జూలై 10: ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూలై 11 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్న కుటుంబ సంక్షేమ, కుటుంబ నియంత్రణ అవగాహన కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలు, బ్యానర్లను శుక్రవారం మంచిర్యాలలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాల పరిధిలో వైద్యులు, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది ప్రజలకు కుటుంబ నియంత్రణ పద్ధతులు, కుటుంబ సంక్షేమ కార్యక్రమాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులైన నోటి మాత్రలు, అంతర ఇంజెక్షన్, మాల-ఎన్, ఛాయా, ఈజీ పిల్, ఐయూసీడీ, పురుషుల కోసం నిరోధ్ వంటి సాధనాలపై ప్రజలకు వివరించి, ఆయా కేంద్రాల్లో సమాచారం అందుబాటులో ఉంచాలని తెలిపారు.అదేవిధంగా శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతులైన పురుషులకు వాసెక్టమీ, మహిళలకు ట్యూబెక్టమీపై కూడా ప్రజలకు అవగాహన కల్పించి, అవసరమైన వారికి సేవలు అందించాలని సూచించారు. కుటుంబ నియంత్రణ పాటించడం ద్వారా దంపతులు ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన దాంపత్య జీవితం గడపడమే కాకుండా, పిల్లలను బాధ్యతాయుత భావి పౌరులుగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. “చిన్న కుటుంబం – చింతలేని కుటుంబం” “పిల్లలకు సరైన అంతరం… కుటుంబానికి ఆరోగ్యకరమైన భవిష్యత్తు” అనే సందేశాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు.ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ప్రారంభమయ్యే ఈ వారోత్సవ కార్యక్రమాలను జిల్లాలో విజయవంతంగా నిర్వహించి, ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో విస్తృత ప్రచారం చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ అశోక్, డాక్టర్ తబియా, డాక్టర్ అరుణ శ్రీ, బుక్కా వెంకటేశ్వర్, ఆర్.ఎస్. పద్మ, కాకిరాల వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, నాందేవ్, ప్రవళిక, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

