బెల్లంపల్లి, జూలై 10: బెల్లంపల్లి 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సుధాకర్ నాయక్, ఆసుపత్రి వైద్య సంచాలకుడు డాక్టర్ రవికుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహారం అత్యంత అవసరమని, చికిత్సతో పాటు సరైన ఆహారం తీసుకుంటే త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సుధాకర్ నాయక్ ఐదుగురు క్షయ వ్యాధిగ్రస్తులను దత్తత తీసుకుని ఆరు నెలల పాటు పోషకాహార కిట్లు అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు.అనంతరం ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను డాక్టర్ రవికుమార్‌తో కలిసి సమీక్షించారు. ప్రసవ సేవలు, అసంక్రమణ వ్యాధుల నిర్ధారణ, చికిత్సలు, క్షయ వ్యాధి నియంత్రణ చర్యలు, అవగాహన కార్యక్రమాలు, తెలంగాణ డయాగ్నస్టిక్స్‌కు రక్త నమూనాల పంపిణీ, 30 సంవత్సరాలు పైబడిన వారికి అసంక్రమణ వ్యాధుల స్క్రీనింగ్, అత్యవసర మందుల నిల్వలు, పాము కాటు, కుక్కకాటు వ్యాక్సిన్లు, ఓఆర్‌ఎస్ నిల్వలు, నవజాత శిశువులు మరియు చిన్నారులకు అందిస్తున్న వైద్య సేవలపై అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ నెల 13న నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఒకటి నుంచి 19 సంవత్సరాల వయస్సు గల ప్రతి చిన్నారికి ఆల్బెండజోల్ మాత్రలు అందేలా వైద్యులు, వైద్య సిబ్బంది, ఆశా ఆరోగ్య కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, అల్లాడి శ్రీనివాస్, సీహెచ్‌వో నాందేవ్, సబ్ యూనిట్ అధికారి శ్రీనివాస్, డాక్టర్ మూర్తి, క్షయ వ్యాధి విభాగం సిబ్బంది, నర్సింగ్ అధికారులు, ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ బెల్లంపల్లి సిబ్బంది, మురళి, ఆశా ఆరోగ్య కార్యకర్తలు, క్షయ వ్యాధిగ్రస్తులు తదితరులు పాల్గొన్నారు.

