మంచిర్యాల,జూలై 10: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా డిజిటైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసి ఈ నెల 24వ తేదీలోగా పూర్తి చేయాలని భారత ఎన్నికల సంఘం డిప్యూటీ ఎన్నికల కమిషనర్ పవన్ కుమార్ శర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం న్యూ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, జిల్లా ఎన్నికల అధికారులు, కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల జాబితాలో పారదర్శకత ప్రజాస్వామ్యానికి కీలకమని, అర్హులైన ప్రతి పౌరుడు ఓటరు జాబితాలో చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, డిజిటైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు విచారణ లేకుండా ఏ ఓటరు పేరును తొలగించరాదని స్పష్టం చేశారు. అలాగే పోలింగ్ కేంద్రాల్లో 1,200 మందికి మించి ఓటర్లు ఉండకుండా క్రమబద్ధీకరణ చేపట్టాలని ఆదేశించారు.రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ 99.6 శాతం పూర్తైందని, డిజిటైజేషన్ 21.94 శాతం పూర్తైందని తెలిపారు.జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహిస్తున్నామని, మ్యాపింగ్ డేటా ఆధారంగా ఎన్యూమరేషన్ ఫారాలను పరిశీలించి డిజిటైజేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.

