* జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డా. బాబు జగ్జీవన్ రామ్ జీవితం అందరికీ ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఆదివారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్లు పి. చంద్రయ్య, శ్రీనివాస్ రావు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్, జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు చాతరాజుల దుర్గాప్రసాద్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి భాగ్యవతి, వివిధ కుల సంఘాల ప్రతినిధులతో కలిసి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశ ఉప ప్రధానిగా, వివిధ పదవులలో పని చేసి డా. బాబు జగ్జీవన్ రామ్ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించారని, అంటరానితనాన్ని రూపుమాపేందుకు ప్రజలను సంఘటిత పరుస్తూ పోరాడారని తెలిపారు. కేంద్ర వ్యవసాయ, కార్మిక, ఆహారం, ఉపాధి పునరావాసం, రవాణా తంతి తపాలా, రైల్వే, రక్షణ శాఖల క్యాబినెట్ మంత్రిగా, ఉప ప్రధానమంత్రిగా దేశానికి ఎనలేని సేవలు అందించారని తెలిపారు. 100 సంవత్సరాల తరువాత పరిస్థితులను ముందే గ్రహించి రచించిన పుస్తకాలతో ప్రజలలో చైతన్యం తీసుకువచ్చారని, వర్ణ వ్యవస్థను నిర్మూలించేందుకు కృషి చేశారని తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేద్కర్ సామాజిక సమానత్వం కోసం అహర్నిశలు శ్రమించారని, రాజ్యాంగంలో పొందుపరిచిన సామాజిక సమానత్వం ఫలాలను నేడు మనం అనుభవిస్తున్నామని తెలిపారు. మహనీయులు ఆచరించిన సన్మార్గాలను ప్రతి ఒక్కరు అనుసరించాలని, భావితరాలకు మహానుభావుల జీవిత చరిత్రలు తెలిసేలా ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

