ధైర్యంగా ఫీర్యాదు చేయండి… షీ టీమ్ మీకు అండగా ఉంది
షీ టీమ్ ఎస్ ఐ ఉషారాణి
ఎక్కడైనా, ఎప్పుడైనా యువతులు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, వేధింపులకు గురి చేసినా ధైర్యంగా ముందుకు వచ్చి షి టీమ్ కు పిర్యాదు చెయ్యలని మేము మీకు అండగా ఉంటామని షీ టీమ్ ఎస్ ఐ ఉషారాణి అన్నారు. రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు మంచిర్యాల పట్టణంలోని రెవెలేషన్ పాఠశాలలో శుక్రవారం మంచిర్యాల షీ టీమ్ ఎస్ఐ ఉషారాణి ఆధ్వర్యంలో మహిళా భద్రత, బాలికల రక్షణ, వేధింపుల నివారణ వంటి అంశాలపై విద్యార్థినిలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఉషారాణి మాట్లాడుతూ మహిళలు, బాలికలపై జరిగే వేధింపులు, ఈవ్ టిజింగ్, సోషల్ మీడియాలో వేదింపులు, అసభ్య ప్రవర్తనలు వంటి ఘటనలను అరికట్టేందుకు షీ టీమ్ పోలీసులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. అత్యవసర సమయంలో డయల్ 100/112, 181 మహిళా హెల్ప్ లైన్ నెంబర్లను విద్యార్థులు గుర్తుంచుకోవాలని సూచించారు. పాఠశాల నుండి ఇంటికి వెళ్లే మార్గంలో ఏదైనా అనుమానాస్పద వ్యక్తులు, వేధింపులు ఎదురైతే వెంటనే రామగుండం కమీషనరేట్ షీ టీమ్ నెంబర్ 6303823700, మంచిర్యాల షీ టీమ్ నెంబర్ 8712659385 సమాచారం ఇవ్వాలని విద్యార్థులకు తెలిపారు. సైబర్ వేధింపులపై బాధపడుతున్న బాలికలు తమ ఫిర్యాదులను పోలీసులకు తెలియజేయాలని, అన్ని రకాల ఫిర్యాదులను గోప్యంగా స్వీకరిస్తామని భరోసా కల్పించారు. సోషల్ మీడియాలో తెలియని వ్యక్తుల ఫ్రెండ్ రిక్వెస్టులను అంగీకరించ కూడదని, వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని సూచించారు. బాలికల భద్రత కోసం రామగుండం కమీషనరేట్ పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, మీలో ధైర్యం, అవగాహన పెంపు మా ప్రధాన లక్ష్యమని, ఏ సమస్య అయినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా షి టీమ్ ఇంచార్జి ఎస్ఐ ఉషారాణి, షి టీమ్ సిబ్బంది కానిస్టేబుల్ సతీష్, మహిళా కానిస్టేబుళ్లు శ్రీలత, శైలజ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్, కరస్పాండెంట్ విష్ణువర్ధన్, పాఠశాల ఉపాద్యాయులు, 300 మంది విద్యార్థినులు పాల్గొన్నారు.

