గంజాయి రహిత సమాజ నిర్మాణమే మనందరి లక్ష్యం కావాలి
మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, ఐపీఎస్
యాంటీ-డ్రగ్ అవేర్నెస్ వారోత్సవాలలో భాగంగా మందమర్రిలో విద్యార్థులకు దిశానిర్దేశం
మందమర్రి: యువత, ముఖ్యంగా విద్యార్థులు మత్తు పదార్థాల మహమ్మారికి దూరంగా ఉంటూ, ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని, గంజాయి రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని మంచిర్యాల జిల్లా డెప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ ,డీసీపీ, ఏ. భాస్కర్, పిలుపునిచ్చారు. యాంటీ-డ్రగ్ అవేర్నెస్ వారోత్సవాలలో భాగంగా సోమవారం మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన పలు కార్యక్రమాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా తెలంగాణ మోడల్ స్కూల్‌లో ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో డీసీపీ మాట్లాడుతూ, విద్యార్థి దశ మీ జీవితానికి అత్యంత కీలకమైన పునాది. ఈ సమయంలో తెలియని ఆకర్షణలకు లోనై గంజాయి వంటి మత్తు పదార్థాల బారిన పడితే మీ భవిష్యత్తు అంధకారమయమవుతుంది .ఇది కేవలం మీ ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, మీ కుటుంబాన్ని, మీ కలలను కూడా నాశనం చేస్తుంది. పోలీసులు మీ శ్రేయోభిలాషులు. ఎన్.డి.పి.ఎస్ యాక్ట్ చాలా కఠినమైనది, ఒకసారి ఈ కేసులో చిక్కుకుంటే జీవితాంతం దాని పర్యవసానాలు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి, మీరంతా చైతన్యవంతులై, మీ స్నేహితులను కూడా ఈ వ్యసనం వైపు వెళ్లకుండా కాపాడాలి” అని హితవు పలికారు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా, గంజాయి దుష్ప్రభావాలను కళ్ళకు కట్టినట్లు చూపే దృశ్యరూపక వీడియోలను ప్రదర్శించి, వారిలో బలమైన అవగాహన కల్పించారు.
పర్యావరణ పరిరక్షణతో పాటు సామాజిక చైతన్యం:
అంతకుముందు, డీసీపీ ఇతర ఉన్నతాధికారులతో కలిసి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం తెలంగాణ మోడల్ స్కూల్ ఆవరణలలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణతో పాటు, విద్యార్థులలో సామాజిక బాధ్యతను పెంపొందించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని వారు పేర్కొన్నారు.
మంచిర్యాల జిల్లాను గంజాయి రహితంగా మార్చేందుకు పోలీస్ శాఖ అహర్నిశలు శ్రమిస్తోందని, ఇందులో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతిరోజూ వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నామని డీసీపీ తెలిపారు. ప్రజల చైతన్యం, సహకారంతోనే గంజాయిని పూర్తిగా నిర్మూలించగలమని, తద్వారా నేరరహిత సమాజాన్ని స్థాపించగలమని ఆయన గట్టిగా విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమాలలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి, మందమర్రి తహసిల్దార్ సతీష్ కుమార్, మందమర్రి ఎంపీడీవో, కస్తూర్బా స్కూల్స్ జిల్లా కోఆర్డినేటర్, కస్తూర్బా, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్స్, మందమర్రి ఎస్సై రాజశేఖర్, అదనపు ఎస్ఐ శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.