ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ
ఎంపీ సెగ్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టి వస్తున్న కాంగ్రెస్ నేతలు
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ప్రచారంలో దూసుకుపోతున్నారు. పెద్దపెల్లి పార్లమెంట్ సెగ్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలను సుడిగాలిలా చుట్టి వస్తున్నారు. మంథని అసెంబ్లీ నియోజకవర్గం మహా ముత్తారం నుంచి చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం కోటపల్లి వరకు బెల్లంపల్లి మంచిర్యాల ధర్మపురి రామగుండం గోదావరిఖని పెద్దపల్లి ప్రాంతాలను పర్యటిస్తూ కాంగ్రెస్ ఉనికిని చాటి వస్తున్నారు. ఎక్కడికక్కడ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు వంశీకృష్ణను వెంటేసుకొని అభ్యర్థులం అనే విధంగా చెమటోడ్చి పనిచేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల విజయోత్సహం ఇంకా చల్లరకముందే పార్లమెంట్ ఎన్నికల షెడ్యూలు రావడంతో అదే ఉత్సాహంతో పార్లమెంట్ అభ్యర్థి గెలుపే ధ్యేయంగా కధనోత్సాహంతో ముందుకు సాగుతున్నారు. ర్యాలీలు, ఆత్మీయ సమ్మేళనాలు, కార్యకర్తల సన్నాహక సమావేశాలు కూల్ బెల్ట్ ఏరియాలో బొగ్గు బావులపై గేట్ మీటింగులు ఎలా వీలైతే అలా ప్రచారంలో తమ మార్కును చూపిస్తున్నారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం లో ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ విజయం ఖాయం అనే సంకేతాలు ఇస్తున్నారు మెజారిటీ వైపే తమ ప్రచారమని డంకా భజాయించి చెప్తున్నారు. తనయుని గెలుపు కోసం తండ్రి వివేక్ వెంకటస్వామి అహోరాత్రులు శ్రమిస్తున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ఇన్చార్జి ఐటీ మంత్రి దుదెల శ్రీధర్ బాబు గడ్డం వంశీ గెలుపును ఛాలెంజ్ గా తీసుకొని అంతా తానై వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వ తప్పిదాలను ఎండగడుతూ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే తాము ఇచ్చిన హామీలను నెరవేర్చమని ప్రజలకు విడమర్చి చెబుతున్నారు.కాంగ్రెస్ కు అప్పుడు మేడిగడ్డ కుంగుబాటు,
ఇప్పుడు ఓడేడ్ బ్రిడ్జి కూలి పోవడం కలిసివచ్చే ప్రచార అంశాలుగా మారాయి. లక్ష కోట్ల మేడిగడ్డ 50 గట్లడు బ్రిడ్జి బి ఆర్ ఎస్ నాయకుల కమిషనర్ కృతికి నీళ్లపాలయ్యాయని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గడ్డంశీని పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీగా గెలిపిస్తే మంథని ప్రాంతానికి పరిశ్రమలు వస్తాయని తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడి నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని వివరిస్తున్నారు.అలాగే సింగరేణి కార్మిక క్షేత్రంలో కార్మికులకు కోటి రూపాయల ప్రమాద బీమా హామీని నిలబెట్టుకున్నామని మళ్లీ ఇప్పుడు ప్రతీ కార్మికునికి ఇల్లు కారుణ్య నియామకాలు లాంటి హామీలను ఇచ్చి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. రామగుండం ఆర్.జి.123 ఏరియాలలో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఐఎన్టీయూసీ ట్రేడ్ యూనియన్ నాయకులు గేట్ మీటింగ్లు ఏర్పాటు చేసి కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం సాగిస్తున్నారు. పోటీలో ఉన్న ప్రధాన పార్టీలైన బిజెపి ప్రచారం ఇంకా ఊపందుకోలేదు. ఎన్నికలకు ఇంకా 17 రోజుల సమయం ఉంది కాబట్టి ప్రచారం ఏమలుపు తిరుగుతుందో వేచి చూడాలి ఏది ఏమైనా కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపు ఖాయమనే విశ్వాసాన్ని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు.