October 3, 2026
Praja Telangana
తెలంగాణ

*ఆయుర్వేదంతో ఆరోగ్యకరమైన భవిష్యత్తు: డిఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్*

మంచిర్యాల,సెప్టెంబర్ 24 (నేటి ప్రజా తెలంగాణ):జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు. జిల్లా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ కార్యక్రమంలో భాగంగా అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, ఆర్‌ఎంవో డాక్టర్ శ్రీధర్ కలిసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ చంద్రయ్య మాట్లాడుతూ జిల్లాలోని ఆయుర్వేద ఆసుపత్రుల ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ‘ఆరోగ్యకరమైన భవిష్యత్తు ఆయుర్వేదంతో’ అనే సందేశంతో ప్రజలకు ఆయుర్వేదంపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. జీవనశైలి మార్పులతో వచ్చే రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్, జీర్ణాశయ సంబంధిత సమస్యలు వంటి అసంక్రమణ వ్యాధుల నియంత్రణలో ఆయుర్వేద విధానాలు ఉపయోగపడతాయని తెలిపారు.ఆరోగ్య పరిరక్షణకు పౌష్టికాహారం తీసుకోవడం, క్రమబద్ధమైన జీవన విధానం పాటించడం, వ్యాయామం, యోగా, ధ్యానం వంటి వాటిని అలవాటుగా చేసుకోవాలని సూచించారు. మన పూర్వీకులు అందించిన ఆయుర్వేద వైద్య విధానాన్ని పరిరక్షించడంతో పాటు ఆయుర్వేద వైద్యుల సూచనలు పాటించాలని కోరారు.జిల్లాలో 12 ఆయుర్వేద ఆసుపత్రుల ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారితో పాటు వృద్ధులు, చిన్నారులకు ఆయుర్వేద వైద్య సేవలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.అవసరాన్ని బట్టి ఆధునిక వైద్య విధానంతో పాటు ఆయుర్వేద వైద్య సేవలను కూడా వైద్యుల సలహా మేరకు వినియోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఆయుర్వేద వైద్యాధికారి డాక్టర్ నీరజ,జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, అల్లాడి శ్రీనివాస్, సబ్ యూనిట్ అధికారి శ్రీనివాస్, జిల్లా కార్యక్రమ అధికారి రవీందర్ రాథోడ్, వైద్యులు సంజయ్, శ్రీదేవి, శృతి, వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.సికిల్ సెల్ ఎనీమియా పరీక్షల కోసం ఆసుపత్రికి వచ్చిన వారికి, వారి తల్లిదండ్రులకు ఆయుర్వేద వైద్య విధానంపై అవగాహన కల్పించారు.

Related posts

*పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి*

అడ్డా కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

తెలంగాణ ఆర్ ఎం పి & పి ఎం పి వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఎన్నిక

Share this