మంచిర్యాల, సెప్టెంబర్ 5 (నేటి ప్రజా తెలంగాణ): రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రతిష్ఠాత్మక విశిష్ట ప్రతిభా పురస్కారం–2026 అందుకున్నారు. శనివారం కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కలెక్టర్ ఈ పురస్కారాన్ని స్వీకరించారు.2026–27 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపులో మంచిర్యాల జిల్లా విశిష్ట ప్రతిభ కనబరిచినందుకు ఈ పురస్కారం లభించింది. 2025–26 విద్యా సంవత్సరంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 43,072 మంది విద్యార్థులు ఉండగా, 2026–27లో ఆ సంఖ్య 45,626కు చేరింది. దీంతో అదనంగా 2,554 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. 2024–25 విద్యా సంవత్సరంతో పోలిస్తే రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు 10.34 శాతం పెరిగింది.జిల్లాలోని 282 ప్రభుత్వ పాఠశాలల్లో 10 శాతానికి పైగా అదనపు విద్యార్థుల నమోదు సాధించగా, మందమర్రి, నస్పూర్, జైపూర్, హాజీపూర్, భీమారం మండలాల్లోనూ విద్యార్థుల నమోదు గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా 2026–27 విద్యా సంవత్సరంలో 4,346 మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలను వీడి ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం ప్రభుత్వ విద్యపై తల్లిదండ్రుల్లో పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనంగా నిలిచింది.జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మార్గదర్శకత్వంలో విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఎంఐఎస్, సీసీవోలు, సీఆర్పీలు సమన్వయంతో చేపట్టిన కార్యాచరణ, నిరంతర పర్యవేక్షణ, సమష్టి కృషి ఫలితంగా జిల్లాలో ప్రభుత్వ విద్యాభివృద్ధిలో గణనీయమైన పురోగతి సాధ్యమైందని అధికారులు తెలిపారు.ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపుతో పాటు విద్యా ప్రమాణాల మెరుగుదలకు చేపట్టిన చర్యలకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభించడం పట్ల జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యా సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లాకు రాష్ట్రస్థాయిలో విశిష్ట గుర్తింపు దక్కడం జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు.

