మంచిర్యాల,జూలై 9 (నేటి ప్రజా తెలంగాణ):గిరిజనులు, గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత స్నేహపూర్వకంగా, అందుబాటులో ఉండే పోలీసింగ్ అందించడంతో పాటు పోలీస్ శాఖలోని ఆధునిక సాంకేతిక సేవలను ప్రజలకు చేరవేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులను ఆదేశించారు. గురువారం వార్షిక తనిఖీల్లో భాగంగా మంచిర్యాల జోన్ పరిధిలోని మాదారం పోలీస్ స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు.ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, కమ్యూనికేషన్ వ్యవస్థ, పెండింగ్ కేసులు, రికార్డులు, పోలీస్ వాహనాల నిర్వహణను పరిశీలించిన సీపీ, ప్రతి వాహనంలో ఫస్ట్ ఎయిడ్ కిట్, డ్రాగన్ లైట్, ట్రాఫిక్ కోన్స్, రైట్ గేర్ కిట్ తదితర అత్యవసర సామగ్రి తప్పనిసరిగా ఉండాలని సూచించారు. అనంతరం పోలీస్ సిబ్బందితో సమావేశమై విధులు, సమస్యలపై ఆరా తీశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజనులతో సున్నితంగా వ్యవహరిస్తూ వారి సమస్యలను అర్థం చేసుకుని విశ్వాసాన్ని పెంపొందించాలని సూచించారు. సీసీటీఎన్ఎస్, హాక్ ఐ, టీఎస్ కాప్ వంటి సాంకేతిక సేవలను సమర్థంగా వినియోగించడంతో పాటు పాస్పోర్ట్ వెరిఫికేషన్, ఆన్లైన్ ఫిర్యాదులు తదితర సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. మహిళల భద్రత, చిన్నారుల రక్షణ కోసం ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.అలాగే గంజాయి, ఇతర మత్తు పదార్థాల దుష్పరిణామాలు, సైబర్ నేరాల నివారణ, సీసీ కెమెరాల ప్రాముఖ్యత, రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై పాఠశాలలు, కళాశాలలు, గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్, ఆకస్మిక వాహన తనిఖీలు నిరంతరం చేపట్టి నేరాల నియంత్రణకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో వెంటనే స్పందించేలా ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్లాన్ సిద్ధంగా ఉంచాలని సూచించారు.అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో అధికారులతో కలిసి మొక్కలు నాటిన సీపీ, మాదారం పోలీస్ స్టేషన్ నిర్వహణ, సౌకర్యాలు, పనితీరు సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొంటూ ఎస్ఐ, సీఐతో పాటు సిబ్బందిని అభినందించారు.

