June 10, 2026
Praja Telangana
తెలంగాణ

*అరైవ్ అలైవ్ లక్ష్యంగా గ్రామసభల్లో రోడ్డు భద్రతా చైతన్యం*

*మంచిర్యాల,జూన్,10*:రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో బుధవారం మంచిర్యాల జిల్లాలో నిర్వహించిన గ్రామసభల్లో రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో భాగంగా వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు అధిక సంఖ్యలో హాజరు కావడం జరిగింది.ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని అన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు, వెనుక కూర్చునే వ్యక్తులు కూడా హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనాల్లో ముందు, వెనుక సీట్లలో ప్రయాణించే వారు సీటు బెల్ట్ వినియోగించాలని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేయడం, అతివేగం, రాంగ్ సైడ్ డ్రైవింగ్, జిగ్‌జాగ్ డ్రైవింగ్ వంటి చర్యలు ప్రమాదాలకు ప్రధాన కారణాలని పేర్కొన్నారు.
అనంతరం గ్రామాల వారీగా రోడ్డు భద్రతా పరిస్థితులపై ప్రత్యేక ప్రజెంటేషన్లు నిర్వహించి డిఫెన్సివ్ డ్రైవింగ్‌పై అవగాహన కల్పించారు. జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి ప్రమాదాల తీవ్రతను వివరించారు. అలాగే రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు, మృతుల కుటుంబ సభ్యులు తమ అనుభవాలను గ్రామస్థులతో పంచుకున్నారు.గ్రామసభల్లో భాగంగా “హెల్మెట్ లేకపోతే వాహనం నడపరాదు”, “సీటు బెల్ట్ లేకుండా ప్రయాణించరాదు”, “హెల్మెట్ లేకపోతే గ్రామంలో ప్రవేశం లేదు” వంటి తీర్మానాలను గ్రామస్థులు స్వచ్ఛందంగా ఆమోదించారు.ఈ కార్యక్రమంలో రవాణా శాఖ, జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ), ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య, విద్యాశాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Related posts

ఘనంగా దళితుల పోరాట యోధుడు భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు

బెల్లంపల్లి బాలికలకు షీ టీం అవగాహన కార్యక్రమం

Share this