Praja Telangana
తెలంగాణ

పుస్తకాలోచ్చాయి, పాఠశాలలు తెరిచే నాటికి పంపిణీ కి చర్యలు

పుస్తకాలోచ్చాయి, పాఠశాలలు తెరిచే నాటికి పంపిణీ కి చర్యలు

కొత్త విద్యాసంవత్సరంలో పాఠశాలలు తెరిచేలోపు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పుస్తకాల సరఫరాకు చర్యలు చేపట్టింది. ఈ విద్యా సంవత్సరంలో ప్రణాళిక ప్రకారం ముందే ముద్రణకు శ్రీకారం చుట్టింది. ఏప్రిల్‌ నుంచే ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. దీంతో 80 శాతానికి పైగా ఆయా తరగతుల పుస్తకాలు జిల్లాకు చేరాయి. 

జిల్లాలో 623 ప్రభుత్వ ప్రాథమిక, 128 ప్రాథమికోన్నత, 146 ఉన్నత పాఠశాలలు, 15 కస్తూర్బా, 7 ఆదర్శ, 27 గురుకుల విద్యాలయాలు ఉన్నాయి. ఆయా వాటిల్లో 83,305 మంది చదువుకుంటున్నారు. వీరికి 4.60 లక్షల పుస్తకాలు అవసరమని విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలు పం పించారు. ఇప్పటికే గోదాములో పాతవి 38 వేల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. విద్యాసంవత్సరం ఆరంభంలో పార్ట్‌-1 పుస్తకాలు అందించనున్నారు. ఎస్‌ఎ-1 పరీక్షలు పూర్తయ్యాక సెప్టెంబరు, అక్టోబరులో పార్ట్‌-2 పంపిణీ చేయనున్నారు.

*నేరుగా పాఠశాలలకే*

విద్యార్థులకు ఎలాంటి ఖర్చు లేకుండా రెండేళ్ల నుంచి రాత పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. సర్కారు బడుల్లో ఇది వరకు ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థుల నుంచి ఇంటర్‌ వరకు చదివే వారికి ఉచితంగా రాత పుస్తకాలు అందజేశారు. ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రాథమిక స్థాయి వారికి సైతం ఇవ్వనున్నారు. రాత పుస్తకాలు సైతం ఇది వరకు జిల్లా గోదాముకే చేరేవి. కానీ ఈ సారి నుంచి నేరుగా ముద్రణ కేంద్రం నుంచి పాఠశాలలకు చేరవేయనున్నారు.

*83 శాతం రాక*

జిల్లా కేంద్రంలోని పాఠ్యపుస్తకాల గోదాముకు 3.84 లక్షల పుస్తకాలు వచ్చాయి. ఒకటి నుంచి పదో తరగతి వరకు అన్ని మాధ్యమాలకు చెందిన 138 టైటిల్స్‌ అవసరం కాగా, ఇప్పటి వరకు 117 టైటిల్స్‌ పుస్తకాలు వచ్చాయి. ఇంకా 21 టైటిల్స్‌ పుస్తకాలు రావాల్సి ఉంది. మిగతా 1.04 లక్షల పుస్తకాలు రానున్నాయి. ఆదివారం నుంచి జిల్లా గోదాం నుంచి మండల వనరుల కేంద్రాలకు చేరవేయనున్నారు.

Related posts

బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశం

Share this