Praja Telangana
తెలంగాణ

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి అధికారుల సమన్వయంతో చర్యలు

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి అధికారుల సమన్వయంతో చర్యలు

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

నేటి ప్రజాతెలంగాణ:మంచిర్యాల

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించే దిశగా సంబంధిత అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, మంచిర్యాల, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారులు శ్రీనివాస్వు, హరికృష్ణ లతో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. జైపూర్ మండలం గుత్తదార్ పల్లి గ్రామస్తులు తమ గ్రామంలోని ఇండ్లు శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు క్రింద కోల్పోయామని, నష్టపరిహారం రావలసినవారికి ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. కోటపల్లి మండలం సిర్స గ్రామానికి చెందిన పూజారి బక్కమ్మ తన భర్త పేరిట ఉన్న ఇంటిని ఆయన మరణానంతరం తన పెద్ద కుమారుడు తమకు ఎలాంటి సమాచారం లేకుండా తన పేరిట మార్చుకున్నాడని, ఇట్టి మార్పును రద్దు చేసి తమకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. కన్నేపల్లి మండలం చింతపూడి లింగాల గ్రామస్తులు తమ గ్రామంలో గుడుంబా, బెల్ట్ షాపులు నిర్వహించడంతో గ్రామ యువత పెడదారి పడుతున్నారని, ఈ విషయంపై విచారించి గుడుంబా, మద్యం విక్రయాలను నియంత్రించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. జన్నారం మండలం కవ్వాల్ గ్రామానికి చెందిన భోజనపు సురేందర్ నిరుపేద అయిన తనకు ఉపాధి కల్పించాలని కోరుతూ గతంలో దరఖాస్తు చేసుకున్నారని, అవకాశం కల్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. మంచిర్యాల పట్టణానికి చెందిన మహమ్మద్ ఆసిఫ్ పాషా తాను పుట్టుకతో నిరుపేద దివ్యాంగుడిని అని, ఎస్.ఎస్.సి. పూర్తి చేశానని, ఉపాధి కల్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. మంచిర్యాల జిల్లా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ప్రతినిధులు తమ దరఖాస్తులో హైదరాబాద్ జి.హెచ్.ఎం.సి. కార్మికులకు అందిస్తున్న వేతనాలను జి. ఓ. ప్రకారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులకు అందించాలని కోరారు. లక్షెట్టిపేట మండలం తలమల గ్రామానికి చెందిన గిరిజన రైతులు తమ వ్యవసాయ భూములలో బోరు బావి ఏర్పాటు చేయాలని, బోర్ డ్రిల్లింగ్ అయిన రైతుల సంబంధిత భూములలో మోటార్లు బిగించి ఆదుకోవాలని కోరుతూ అర్జీ సమర్పించారు. జన్నారం మండల అభివృద్ధి కమిటీ ప్రతినిధులు జన్నారం మండల కేంద్రంలో ప్రజల సౌకర్యార్థం 30 పడకల సామాజిక ఆసుపత్రి మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. మంచిర్యాల పట్టణానికి చెందిన సురేష్ కుమార్ తాను కుటుంబ సర్వే దరఖాస్తుల డాటా ఎంట్రీ పని చేశానని, సంబంధిత డబ్బులు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, అర్జీదారులు పాల్గొన్నారు.

Related posts

ఆర్&ఆర్ సెంటర్ స్థలాల పంపిణీ

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)*

తెలంగాణ సచివాలయ సందర్శన లోప్రపంచ ముద్దుగుమ్మలు*

Share this