అంగరంగ వైభవంగా దసరా వేడుకలు
సింగరేణి ఆధ్వర్యంలో మహిషాసురుడి దిష్టి బొమ్మ దహనం
వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వివేక్, జిఎం
నేటి ప్రజా తెలంగాణ, మందమర్రి టౌన్.
శక్తి స్వరూపిణి, జగజ్జనని దుర్గాదేవి తొమ్మిది అవతారాలలో నవరాత్రులు ముగియడంతో మందమర్రి పట్టణంలో శనివారం విజయదశమి పండుగ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. శనివారం సాయంత్రం పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన మహిషాసుర రాక్షసుడి దిష్టి బొమ్మ దహన కార్యక్రమాన్ని వీక్షించేందుకు పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలతో మైదానం కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, రంగుల వెదజల్లే బాణసంచా కాంతులు, సప్త వ్యసన దిష్టిబొమ్మ దహనం వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి, వివేక్ సతీమణి సరోజ దంపతులు, ఏరియా జిఎం జి దేవేందర్, ఏఐటీయూసీ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య పాల్గొని, శ్రీ వెంకటేశ్వర ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవిని దర్శించుకొని, శమీ పూజ, అమ్మవారి ఊరేగింపు పల్లకి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ ప్రజలందరికీ విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాక్షస సంహారానికి ప్రతీక దసరా అని, చెడుపై మంచి గెలిచే తీరుతుంది అన్న సందేశాన్ని తెలిపే పండుగ విజయదశమి అని అన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండి, ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఆనందంగా జీవించాలని అమ్మవారిని వేడుకున్నారు. పండుగ నేపద్యంలో పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, పలు కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.