చలో హైదరాబాద్ ను విజయవంతం చేయండి
ఎస్సికేయు రాష్ట్ర అధ్యక్షుడు దూలం శ్రీనివాస్ గౌడ్.
నేటి ప్రజా తెలంగాణ, మందమర్రి టౌన్.
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం (సిఐటియు) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోరుబాటలో భాగంగా సెప్టెంబర్ 30న నిర్వహిస్తున్న చలో హైదరాబాద్ కార్యక్రమానికి కాంట్రాక్ట్ కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై, జయప్రదం చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దూలం శ్రీనివాస్ కోరారు. సింగరేణి శ్రీరాంపూర్ ఏరియా పరిధిలోని ఎస్ఆర్పి ఓసిపి ఓబిలో పని చేస్తున్న బ్లాస్టింగ్ కాంట్రాక్ట్ కార్మికులతో నిర్వహించిన ద్వార సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సింగరేణిలో వివిధ విభాగాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతన జిఓ లను సవరించి వేతనాలు పెంచకపోవడంతో, చాలీచాలని వేతనాలతో కార్మికులు వెట్టి చాకిరి చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి కనీస వేతనాల జీఓ లను ను సవరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం 2007 నుండి కనీస వేతన జీఓ లను సవరించలేదన్నారు. తెలంగాణ ఏర్పడితే బతుకులు మారతాయని ఆశపడ్డ కార్మిక వర్గానికి నిరాశ ఎదురయిందని ఆరోపించారు. మొన్నటి వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలలో కనీసం కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారని సైతం గుర్తించని పరిస్థితి ఉండేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికుల గురించి, వారి వేతనాలు గురించి పదేపదే మాట్లాడుతున్నా, కనీస వేతనాల జీఓ లను విడుదల చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచుతామని, కోల్ బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేల తోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం హామీ ఇచ్చిన, తొమ్మిది నెలలు గడుస్తున్న వాటి ఊసే ఎత్తడం లేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాల జీఓ లను విడుదల చేసి, సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 30న చలో హైదరాబాద్ కార్యక్రమానికి సింగరేణిలో పనిచేస్తున్న అన్నిh విభాగాల కాంట్రాక్ట్ కార్మికులు కదిలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఓబి బ్లాస్టింగ్ కాంట్రాక్ట్ కార్మికులు వెంకట్, తిరుపతి, సతీష్, గోపాల్, రమేష్ లు పాల్గొన్నారు.