*కౌంటింగ్ కేంద్రంలో పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలి*
*జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్*
నేటి ప్రజా తెలంగాణ: మంచిర్యాల
లోక్ సభ ఎన్నికలు 2024లో భాగంగా మే 13వ తేదీన పోలింగ్ అనంతరం జూన్ 4వ తేదీన జరుగనున్న కౌంటింగ్ ప్రక్రియ కొరకు జిల్లాలోని హాజీపూర్ మండలం ముల్కల్లలో గల ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం హాజీపూర్ మండలం ముల్కల్లలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం ఏర్పాట్లను జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), బెల్లంపల్లి (ఎస్.సి) శాసనసభ నియోజకవర్గ సహాయ రిటర్నింగ్ అధికారి బి.రాహుల్, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతిలాల్, మంచిర్యాల రాజస్వ మండల అధికారి, మంచిర్యాల శాసనసభ నియోజకవర్గ సహాయ రిటర్నింగ్ అధికారి వి.రాములు, ప్రత్యేక ఉప పాలనాధికారి (ఎల్.ఎ., ఆర్&ఆర్), చెన్నూర్ (ఎస్.సి.) శాసనసభ నియోజకవర్గ సహాయ రిటర్నింగ్ అధికారి డి.చంద్రకళ, హాజీపూర్ తహశిల్దార్ పి.సతీష్కుమార్తో కలిసి ఏర్పాట్లును పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పెద్దపల్లి (ఎస్.సి.) పార్లమెంట్ నియోజకవర్గానికి జరుగనున్న ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్ కొరకు పూర్తి స్థాయి ఏర్పాట్లతో సిద్దంగా ఉండాలని తెలిపారు. జిల్లాలోని చెన్నూర్ (ఎస్.సి.), బెల్లంపల్లి (ఎస్.సి.), మంచిర్యాల అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి కౌంటింగ్ జరుగుతుందని, కౌంటింగ్ ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని, కౌంటింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా బందోబస్తు నిర్వహించాలని తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలో కౌంటింగ్ హాల్లు, కౌంటర్లు, విద్యుత్, ఇంటర్నెట్, త్రాగునీరు ఇతరత్రా పూర్తి సదుపాయాలు కల్పించాలని తెలిపారు. మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ జరుగుతాయని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి జూన్ 6వ తేదీ వరకు అమలులో ఉంటుందని తెలిపారు. ఎన్నికల విధులు కేటాయించబడిన అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఎన్నికల ప్రవర్తనా నియమావళికి లోబడి పని చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.